వృద్డుడి చావు ముచ్చట..!
– బతికుండగానే తన పెద్దకర్మ
– ఊళ్లో వాళ్లకు భోజనాలు
– పొలంలో సమాది కూడా ఏర్పాటు
దర్శిని డెస్క్: చావుకు దగ్గర్లో ఉన్న ఓ వృద్దుడు మరణం తరువాత నిర్వహించే కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకున్నారు. తన చావు అనంతరం చేసే పనులు స్వయంగా చేసుకుని ముచ్చట తీర్చుకున్నాడు. వినడానికి ఆశ్చర్యానికి గురిచేసిన ఈసంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. బతికుండగానే పెద్దకర్మ నిర్వహించుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. మరణానంతరం పిల్లలు తనకు పెద్దకర్మ నిర్వహిస్తారో లేదో అని అనుమాతంతో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా కెవానా గ్రామానికి చెందిన జఠాశంకర్ అనే వ్యక్తి ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. జఠాశంకర్‌కు ఎవరూ లేరు కాబోలు, అందుకే ఇలా చేసుకున్నాడని అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే జఠాశంకర్‌కు మొత్తం మూడు పెళ్లిళ్లు అయ్యాయి, ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే చావు తరువాత పెద్ద కర్మ ఎలా నిర్వహిస్తారో అనే అనుమానంతో తానే స్వయంగా ఆ ముచ్చట తీర్చుకున్నాడు. గురువారం ప్రత్యేకంగా వంటలు చేసి ఏకంగా 300 మందికి విందును ఏర్పాటు చేశాడు. అంతేకాదండోయ్ మూడేళ్ల క్రితమే తన పొలంలో సమాధి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై జఠాశంకర్ మాట్లాడుతూ.. చనిపోకముందే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆచారాల్లో భాగం కాదు. అయినా నేను నిర్వహించుకున్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను ఎవరిపైనా ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదు అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి…


