ఓటు హక్కు యువత బాధ్యత
– 18 ఏండ్లు నిండిన వారు తప్పక నమోదు చేసుకోవాలి
– వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ
– తాండూరు డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఓటు హక్కు నమోదు, వినియోగం యువత బాధ్యత అని వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ అన్నారు. బుధవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు (స్వీప్)ఓటు హక్కుపై నమోదు, వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావులు విద్యార్థులకు ఓటు హక్కు నమోదుపై దృశ్య మాద్యమం ద్వారా అవగాహన కల్పించారు. ఓటు నమోదు తరువాత ఎన్నికల్లో ఈవీఎం ద్వారా ఎలా ఓటు హక్కును వినియోగించుకోవాలో వివరించారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ అమిత్ నారాయణ మాట్లాడుతూ ఓటు హక్కు సామాన్యుల చేతిలో వజ్రాయుధం లాంటిందన్నారు. ఓటు హక్కు వినియోగంతోనే సమ సమాజ నిర్మాణం, సమర్థవంత పాలనను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు.
కావున 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులు బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్దార్ తారాసింగ్, కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆర్ఎస్ఐ రాజారెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

