అమ్మ ప్రేమకు చిరునామా..!
– 82 ఏండ్ల వయస్సులో కొడుకులకు సపర్యలు
– ఆదర్శంగా నిలుస్తున్న దానమ్మ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అమ్మను మించిన దైవం ఉన్నదా అనే ప్రశ్నకు లేనేలేదు అనే దానికి చిరునామగా నిలుస్తోంది ఈ అమ్మ. 82 ఏండ్ల వయస్సుల్లో 67 ఏండ్లు, 40 ఏండ్ల వయస్సుల్లో ఉన్న ఇద్దరు కుమారులకు నేటికీ సపర్యలు చేస్తోంది. పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవకు చెందిన దానమ్మకు 82 ఏండ్లు. ఇప్పటికీ కూలీ పనకు వెళుతోంది. ఈమెకు ఇద్దరు కుమారులు భూషి(67), దశరథ(40)లతో పాటు ఇద్దరు కూతుళ్లు. అయితే భూషి, దశరథలు ఇద్దరు దివ్యాంగులే. వారికి ఆరున్నర దశాబ్దాలకుపైగా సపర్యలు చేస్తూ తల్లి ప్రేమకు చిరునామాగా నిలుస్తోంది. ఆమె మొదటి ఇద్దరు కుమారులూ పుట్టుకతోనే దివ్యాంగులు. వీరు పుట్టినప్పటి నుంచీ కదలలేని స్థితిలో ఉన్నారు. భర్త వెంకయ్యతో కలిసి దానమ్మ పిల్లలను పోషించుకుంటూ వచ్చారు. కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. 24 ఏళ్ల కిందట భర్త, పదేళ్ల కిందట రెండో కుమారుడూ చనిపోయారు.
ప్రస్తుతం ముగ్గురికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లే అండగా నిలుస్తున్నాయి. అమ్మమ్మ పరిస్థితిని చూసి మనవడు క్రాంతి(రెండో కుమార్తె కొడుకు) ఆమెతోనే ఉంటూ మేనమామలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తన కుమారులకు చక్రాల కుర్చీలు ఇవ్వాలని, మనవడికి ‘దళితబంధు’ కింద స్వయం ఉపాధి యూనిట్ కేటాయించి అండగా నిలవాలని దానమ్మ వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..

