దరఖాస్తు చేసుకోండి.. ఇంటి నుంచే ఓటేయండి..!
– వృద్ధులు, వికలాంగులు ఓటేసే అవకాశం
– పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు రేపటి వరకే గడువు
– తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన ఓటర్లు ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని తాండూరు అసెంబ్లీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ఓటర్లు దరఖాస్తు చేసుకునేందుకు రేపటి వరకు గడువు విధించడం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అత్యవసర సేవలు అందించే వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్, సమాచార పౌరసంబంధాల శాఖ, రైల్వే శాఖ, పోస్టల్ శాఖతో పాటు కోవిడ్ దీర్ఘకాలిక బాధితులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
అదేవిధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు దాటిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వికలాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం అర్హులైన ఓటర్లు ఫారం-12(డీ) ద్వారా దరఖాస్తులు సమర్పించాలని తాండూరు ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు సూచించారు. తాండూరులో ఇప్పటి వరకు 14 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. మిగతా ఓటర్లు రేపు బుధవారం సాయంత్రం 5 గంటలలోపు తాండూరు రిటర్నింగ్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఓటరు జాబితాలో ఉన్న పూర్తి వివరాలను పొందుపరిచి దరఖాస్తులను అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంటి వద్ద నుంచి ఓటు వేసే వృద్ధులు, వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

