కాంగ్రెస్సోళ్లు.. జాగ్రత్త..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్సోళ్లు.. జాగ్రత్త..!
– సొంత పార్టీనే మోసం చేసిన మహేందర్ రెడ్డి
– హస్తంలో చేరితే బీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టమేం లేదు
– తాండూరులో షాడో ఎమ్మెల్యే అక్రమాలు
– మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు జాగ్రత్త పడాల్సిన అవసరముందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచించారు. మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై పైవిధంగా నాయకులు విమర్శలు చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి, రాజప్ప గౌడ్, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, ఎంపీటీసీ ఫోరం జిల్లా నాయకులు సాయిరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు.

మొదట్లో తెలుగు యువత పార్టీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు మారారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు సార్లు మంత్రిగా, రెండోసారి ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి చేసిందేమి లేదన్నారు. ఆయన సతీమణీ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. కాని గత ఎన్నికల్లో కొ. డంగల్ నియోజకవర్గంలో సొంత తమ్ముడు నరేందర్ రెడ్డితో పాటు తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజక వర్గాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి మహేందర్ రెడ్డి కృషి చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పదవులు పొంది సొంత పార్టీకి వెన్నుపోటు పొడవడం నీచ రాజకీయమన్నారు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కొంతే నష్పమని, పార్టీని వీడితే ఎంతో లాభమని ఎద్దేవా చేశారు.

పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటామని, ఎన్నికల్లో పట్నం ఫ్యామిలీని ఓడిస్తామని అన్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు జరిగిందని, ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నేతలు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఎమ్మెల్యేను, నేతలను మహేందర్ రెడ్డి, అతని వర్గీయులు మోసం చేయొచ్చన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు పైలెట్ రోహిత్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండించారు. డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ తన స్వగ్రామంలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ తీసుకరాలేదని, ఆయన రోహిత్ రెడ్డిపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. మురళీకృష్ణ గౌడ్ ను ఎమ్మెల్యే ద్వారా అభివృద్ధి చెందడమే తాండూరు వెనుకబాటుకు గురైందని వ్యంగంగా విమర్శించారు.

అతనే షాడో ఎమ్మెల్యే
మరోవైపు తాండూరులో షాడో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాండూరులో అవినీతి అక్రమాలు లేని పాలన అందిస్తామని అన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా ఆయన సోదరుడు షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని అన్నారు. ఇటీవల పెద్దేముల్ మండలంలో అక్రమ ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుంటే షాడో ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ, తాండూరు డీఎస్పీలకు ఫోన్లు చేసి విడించుకున్నారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణా, సుద్ధ రవాణా వంటి అక్రమాల్లో షాడో ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఈ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, ఇంతియాత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!