కర్ణాటక మైనింగ్ పాలసీ అమలుకు దృష్టి
– తాండూరు వ్యాపారులకు మైనింగ్ డైరెక్టర్ హామి
– వినతిపత్రం అందించిన తాండూరు వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక తరహాలో తాండూరు నియోజకవర్గంలో మైనింగ్ పాలసీని అమలు చేసేందుకు దృష్టిసారిస్తామని మైనింగ్ శాఖ డైరెక్టర్ సుశీల్ కుమార్ హమి ఇచ్చినట్లు తాండూరు వ్యాపారులు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో తాండూరు నియోజకవర్గ నాపరాతి, సుద్ద పరిశ్రమల ఇబ్బందులపై ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లో మైనింగ్ శాఖ డైరెక్టర్ సుశీల్ కుమార్ ను తాండూరు క్వారీ ఓనర్స్ వెల్ఫేర్, ఎర్త్ మైన్స్ అండ్ మ్యానుఫాక్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాపరాతి, సుద్ద పరిశ్రమలపై రాయల్టీ, లీజు ఫీజులు అధికంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కర్ణాటకలో రాయల్టీ, లీజు ఫీజులు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా తాండూరు నాపరాతి, సుద్ద పరిశ్రమలపై ఆర్థిక భారం తగ్గించాలని కోరారు. ఇందుకు మైనింగ్ శాఖ డైరెక్టర్ సుశీల్ కుమార్ స్పందిస్తూ కర్ణాటక తరహాలో తాండూరు నియోజకవర్గంలో మైనింగ్ పాలసీని అమలు చేసేందుకు దృష్టిసారిస్తామని హామి ఇచ్చినట్లు తెలిపారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి మైనింగ్ శాఖ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రెండు అసోసియేషన్ల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు ఓంప్రకాష్ సోమాని, ప్రధాన కార్యదర్శి జుబేర్ లాల, ఎర్త్ మైన్స్ అండ్ మ్యానుఫాక్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

