ఓట్లన్నీ బీజేపీకే గుద్దాలే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఓట్లన్నీ బీజేపీకే గుద్దాలే..!
– మూడో సారి పీఎం మోడి పక్కా
– రాహుల్‌ గాంధీ కల నెరవేరడం కల్ల
– కొండాను భారీ మెజార్టీతో గెలిపించాలి
– గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్
– ర్యాలీ సక్సెస్‌తో కమలదళంలో జోష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో ముందు బీజేపీకే ఓటు గుద్దాలని హైదరాబాద్‌ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈకార్యక్రమానికి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ర్యాలీ అనంతరం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. రంజిత్‌ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ నుంచి డమ్మీ అభ్యర్థిని బరిలో దింపారని అన్నారు. రంజిత్ రెడ్డి ఎన్నో పాపాలు చేశారని ఆరోపించారు. గుడ్లు అవినీతి, భూ కబ్జా, ఆసుపత్రిలో అవినీతికి పాల్పడ్డారని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అదేవిధంగా రాహుల్‌ గాంధీ నోరు విప్పుతే బీజేపీకి లబ్ది జరుగుతుందని, ఆయన బీజేపీకి ప్రచారకుడుగా ఉన్నారని అభివర్ణించారు. అట్లాంటి వ్యక్తిని దేశానికి ప్రధానిని చేయాలని కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కల్ల అని అన్నారు.

కాంగ్రెస్ స్కాంలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ వల్ల హిందూవులకు నష్టం జరిగిందన్నారు. దేశం కోసం మోడి అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. మూడో సారి ఆయన ప్రధాని కావడం పక్కా, దీనిని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. గతంలో చేవేళ్ల కోసం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంతో చేశారని అన్నారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో కొండాకు భారీ మెజార్టీ అందించి పార్లమెంట్‌కు పంపించాలన్నారు.

గెలిచాక హామిలు నెరవేరస్తా : కొండా
పార్లమెంట్ ఎన్నికల్లో 3 లక్షల మెజార్టీతో గెలువబోతున్నామని చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలో పట్టణాలు, గ్రామాల్లో పర్యటించడం జరిగిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత మళ్లీ గ్రామాల్లో పర్యటిస్తానని అన్నారు. ఎంత మంది కుట్ర చేసినా గెలుపును ఆపలేరన్నారు. మోడీ గ్యారెంటీతో ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తామన్నారు.

ప్రతి ఓటరుకు 20 లక్షల వరకు రుణం ఇప్పిస్తామన్నారు. బషీరాబాద్‌ మండలంలో రైళ్లు హాల్ట్ చేయిస్తానని అన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి, కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్‌కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, తాండూరు నుంచి కోడంగల్‌కు కాగ్నానీటిని తరలిస్తున్నారని, దానిని అడ్డుకుంటామన్నారు.

మరోవైపు తాండూరు పట్టణంలో కొనసాగిన బైక్ ర్యాలీ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ విజయవంతంతో కమలదళంలో కొత్త జోష్ నిండింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, నాయకులు బాలి శివకుమార్, గాజుల శాంతుకుమార్, అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, కిరణ్‌ కుమార్, వివిధ మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్‌ బహిరంగ సభ వాయిదా..!