బాధపెట్టిన బడి బువ్వ..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

బాధపెట్టిన బడి బువ్వ..!
– మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత
– ఆసుపత్రిలో చేరిన విద్యార్థినిలు 
– కందనెల్లి పాఠశాలలో సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : బడిలో పెడుతున్న మధ్యాహ్న భోజనం విద్యార్థులను బాధపెట్టింది. ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం కందనెల్లి తాండా ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతూ తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరారు. మొత్తం 19 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరగా.. 14 మంది సురక్షితంగా కోలుకున్నారు. మరో 5 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతగా ఉండడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మండల ఇంచార్జ్ విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాతా శిశు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరిశీలించారు.

ఆసుపత్రి వైద్యులు డా.అనిల్ మాట్లాడుతూ కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ఆరోపించారు.

ఇదికూడా చదవండి…

తపాలా బీమా పథకాలు వరం