వాగు దాటాలంటే.. సాహసమే..!
– వినూత్న ఆలోచనతో డ్రమ్ముల పడవ
– వ్యవసాయం కోసం కష్టాలు పడుతున్న రైతులు
– ఆ పని పూర్తయితేనే రైతులకు మేలు
– పట్టించుకోవాలని కోరుతున్న రైతులు
తాండూరు, దర్విని ప్రతినిధి : వ్యవసాయమే ఆధారంగా జీవించే రైతులకు ఎప్పుడు కష్టాలు వెన్నంటే ఉంటాయి. ఇందుకు నిదర్శనమే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండల రైతులు చేస్తున్న సాహసం సంఘటన. రైతులు పంట పోలాలకు వెళ్లేందుకు వాగులో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మండలంలోని శివసాగర్ ప్రాజెక్టులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్యాక్ వాటర్ నిండిపోయింది.
ఈ బ్యాక్ వాటర్ కాక్రవేణి నదిలో మండలంలోని నాగసముందర్ గ్రామం మీదుగా ప్రవహిస్తోంది. నదికి అవతలి వైపు రైతులు పొలాలను పండిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులు వాగును దాటి పోలాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కొందరు గ్రామస్తులు వాగు దాటేందుకు డ్రమ్ములతో పడవను రూపొందించుకున్నారు. వినూత్న ఆలోచనతో డ్రమ్ము పడవను తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పడవలోనే రైతులు పొలాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు.
తక్కువ మంది మాత్రమే ఈ డ్రమ్ము పడవలో ప్రయాణం చేసే వీలు ఉంది. అయితే వాగులో ప్రయాణించే సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనతోనే రైతులు పడవ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమస్య తీరాలంటే కాక్రవేణి నదిపై బ్రిడ్జిని నిర్మించాలని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం, పాలకులు స్పందించి నదిపై బ్రిడ్జి నిర్మించి రైతుల కష్టాలను దూరం చేయాలని కోరుతున్నారు.
ఇదికూడా చదవండి..

