సర్వే.. సర్వం మోసం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్వే.. సర్వం మోసం..!
– ప్రజలను మభ్య పెడుతున్న సర్కారు
– ఆరు గ్యారెంటీల అమలు తప్పుదోవ
– సర్వేతో ప్రజలకు ఒరిగేదేమి లేదు
– కేంద్రంలో కుమ్ములాట, రాష్ట్రంలో కుమ్మక్కు
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి, కుల సర్వేతో ప్రజలను సర్వం మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కుల సర్వేను కోతల గణన, క్యాస్ట్ సెన్సెక్స్ కాదు కటింగ్ సెన్సెక్స్ గా ఉందని అభివర్ణించారు. ఈ సర్వేలో కులానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉండగా రాజకీయం, ఆస్తులు, అప్పులు, సంతానం, చదువు వంటి అంశాలను సేకరించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ హాయాంలో ఒకే రోజులో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డాటా ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికి మళ్లీ కొత్తగా సర్వే చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడాన్ని తప్పుదోవ పట్టించేందుకు సర్వే చేపడుతుందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. సర్వే ద్వారానే ఇండ్లు వస్తాయి, సంక్షేమ పథకాలు వర్తిస్తాయంటూ ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. ఈ కుల సర్వేతో ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కుల గణనపై సానుభూతి లేదన్నారు. 1941 నుంచి కాంగ్రెస్ పార్టీ కుల గణనపై సక్యత చూపించలేదన్నారు. నెహ్రు, ఇందిరమ్మ. రాజీవ్ గాంధీ పాలనలో చేపట్టిన కుల గణనపై స్పష్టమైన వైఖరిని చూపించలేదని అన్నారు. వీపీ సింగ్ హయాం నుంచి బడుగు బల హీన వర్గాలకు 27శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తీర్మానం చేస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు.

పీవీ నర్సింహారావు 1992లో ఈడబ్ల్యూఎస్ కావాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారని, 52 శాతం ఉన్న బీసీలకు 27శాతం రిజర్వేషన్ రాజ్యాంగ బద్ధమైనట్లు కొట్టిపారేసిందని విషయాన్ని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగ విరుద్ధమని అప్పుడే చెప్పినా తాజాగా బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూ ఎస్ ప్రవేశ పెట్టి, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు మోసం చేసిందన్నారు. తెలంగాణాలో కేసీఆర్ 55 జీవో తెస్తే.. రేవంత్ రెడ్డి 29 జీవో తీసుకవచ్చి అందరికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్ములాడుతుంటే… తెలంగాణలో రేవంత్ సర్కారు బీజేపీతో కుమ్మక్కు అయ్యిందని విమర్శించారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రజా పాలన కాకుండా అందరిని రోడ్డు మీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి పచ్చి మోసం చేస్తుందన్నారు. పంచాయతీ సర్పంచుల కాలం ముగిసినా ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించే దమ్ము ప్రభుత్వానికి లేదన్నారు. ఇవన్నీ కప్పి పుచ్చుకునేందుకు సర్వే నాటకాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సర్వేకు వస్తే ప్రజలు కులానికి సంబంధించిన వివరాలు మాత్రమే చెప్పాలని సూచించారు. మోసం చేస్తూ, చేపడుతున్న సర్వేపై ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, మళ్లీ సంక్షేమ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

ఫ్రూట్‌ కేక్‌తో పుట్టిన రోజు..!