సీఎం జిల్లాలో హస్టళ్ల హాలత్ బేకార్..!
– కమీషన్లు మెక్కి.. నాసిరకం భోజనాలు
– పిల్లలు పిట్టల్లా రాలుతున్నా కలగని కనువిప్పు
– కనీస బాధ్యతను విస్మరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
– వికారాబాద్ జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్
– వసతిగృహాన్ని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్‌లో వసతి గృహాల హాలత్ బేకార్‌గా ఉందని జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. తాండూరు పట్టణం సాయిపూర్‌లోని గిరిజన వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వసతి గృహాన్ని రాజుగౌడ్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో కేసీఆర్ విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గురుకుల పాఠశాలలను మంజూరు చేయడంతో పాటు అందులో నాణ్యమైన భోజనం అందించారని గుర్తుచేశారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లు మెక్కి విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోనే నాసిరకం భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం దురదృష్టకరమన్నారు. ఇక్కడే ఈ హాలత్ ఉంటే రాష్ట్రంలోని మారు మూల జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రంలోని వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే కాంగ్రెస్‌కు కనివిప్పు కావడం లేదన్నారు. తాండూరులో ఇంత పెద్ద సంఘటన జరిగితే జిల్లా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తాండూరులో 30ఏండ్లు ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కనీసం పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు.
అదేవిధంగా కలెక్టర్‌ను ప్రభుత్వం పావులా వాడుకుంటుందని అన్నారు. ఆయన ద్వారా సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. తాండూరులో పర్యటించిన కార్పోరేషన్ల చైర్ పర్సన్‌లు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అస్వస్థతకు గురైతే బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల సరైన విధంగా స్పందించకపోతే ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ నరుకుల, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, ముక్తార్ నాజ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్, ఈర్షాద్, ఇంతియాజ్, బీఆర్ఎస్వీ నాయకులు సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

