మిస్సింగ్ మిస్టరీ..!
– గౌతాపూర్‌లో బాలుడి అదృశ్యం
– ఎత్తుకెళ్లినట్లు పుకార్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ఓ ఏడాది బాలుడు మిస్సింగ్ అయిన సంఘటన మిస్టరీగా మారింది. ఈ సంఘటన సోమవారం కలలకం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ భాష అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి తాండూరు ప్రాంతానికి వలస వచ్చాడు. గత కొన్ని రోజులుగా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో చిన్న చిన్న మరమ్మత్తుల పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామంలోని మల్లన్న స్వామి గుడివద్ద నిద్రించారు. సోమవారం ఉదయం తమతో ఉన్న ఏడాది వయస్సు ఉన్న బాలుడు కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానించారు. ఈ విషయం గ్రామంలో కొత్త పుకార్లకు కారణమైంది. బాధితులు కరణ్ కోట్ పోలీస్టేషన్లో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలుడి మిస్సింగ్‌పై ఆరా తీస్తున్నారు.
కొంగుకు కట్టుకున్నా..
ఇదిలా ఉండగా రాత్రి 11 గంటల వరకు బాబుతో ఆడుకున్నానని తల్లీ కన్నీటి పర్యంతమైంది. ఎక్కడికైనా వేళతాడేమా అని కొంగుకు కట్టేసుకున్నాని విలపించింది. తెల్లారి చూసే సరికి కొంగును విడిపించి ఎవరో తన కొడుకును ఎత్తుకెళ్లారని రోధిస్తూ చెప్పడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

