తాండూరుకు 20వేల ఇందిరమ్మ ఇండ్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరుకు 20వేల ఇందిరమ్మ ఇండ్లు..!
– వచ్చే నాలుగేళ్లలో అందించడమే లక్ష్యం
– అర్హులైన ప్రతి పేదవాడికి మంజూరు
– నాలుగు దఫాలలో రూ. 5లక్షల నిధులు
– నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– చెన్ గేష్ పూర్ లబ్దిదారులకు అవగాహన
– ఎంపీడీఓ ఆఫీసులో మోడల్ ఇంటి నిర్మాణం పరిశీలన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గానికి 20వేల ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని, వచ్చే నాలుగు ఏండ్లలో మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం తాండూరు మండలంలో పైలెట్ గ్రామ పంచాయతీగా ఎంపికైన చెన్ గేష్ పూర్ గ్రామ పంచాయతి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో శనివారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, పార్టీ నేతలతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ ఇండ్లను అందించకలేపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఎన్నో పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను అందిస్తుందని అన్నారు. తాండూరు నియోజకవర్గానికి వచ్చే నాలుగేళ్లలో 20 వేల ఇళ్లను సీఎం రేవంత్ రెడ్డి అందించబోతున్నారని అన్నారు. గ్రామాల్లో ఇళ్లులేని నిరు పేదలను ఇంటి వాళ్లను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్లు రాని వాళ్లు నిరాశ చెందొద్దని, ప్రతి పేదవాళ్లను వెతికి మరి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమపై ఉందన్నారు.

పైలెట్ గ్రామంగా ఎంపికైన చెన్ గెష్ పూర్ గ్రామంలో అర్హులైన పేదలను ఎంపిక చేసి 144 ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంపికైన లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించుకోవచ్చన్నారు. పునాదుల నుంచి బేస్ మెట్, స్లాబ్ వంటి పలు దశల నిర్మాణాలకు 4 దఫాలుగా ప్రభుత్వం రూ. 5లక్షలను మంజూరు చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న మహిళల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. పాత ఇళ్లకు నిధులు మంజూరు చేసే అవకాశమే లేదని. ఇందులో పైరవీలకు తావులేకుండా, పారదర్శంగా అమలు చేయడం జరుగుతుందన్నారు.

ఒక్క ఏడాదిలో ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అక్కసు వెలగక్కుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పే మాయమాటలను నమ్మొద్దన్నారు. పదేళ్లలో రుణమాఫీ, డబుల్ బెడ్ రూం అందించని పాలనను ప్రజలు తరిమికొట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పాలనలో మోడల్ గా నిలుస్తుందని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, చెన్‌గెష్‌పూర్ గ్రామ లబ్దిదారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

ఇదికూడా చదవండి…

లారీ డ్రైవర్ రిమాండ్..!