రూ. 6వేల కోసమే దారుణం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రూ. 6వేల కోసమే దారుణం..!
– తీసుకున్న అప్పు ఇవ్వలేదని కక్ష్య
– చంపేసీ ఒంటిపై సోత్తు లాక్కునేందుకు ప్లాన్
– ప్రియుడుతో కలిసి హత్యకు పథకం వేసిన మహిళ
– మహిళ మర్డర్ మిస్టరీని చేధించిన పోలీసులు
– కేసు వివరాలను వెల్లడించిన జిల్లా నారాయణ రెడ్డి
– ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించినట్లు వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అప్పుగా తీసుకున్న రూ. 6వేలు తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళను తన ప్రియుడుతో కలిసి హత్యకు పథకం వేసింది మరో మహిళ. ఎలాగైనా ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం, వెండి సొత్తును సొంతం చేసుకుంటే ఇచ్చిన అప్పుకు బదులుగా అధికంగా డబ్బులు వస్తాయని ప్రియుడుతో కలిసి దారుణానికి పాల్పడింది. చివరకు ఇద్దరు నిందితుడు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

మూడు రోజుల క్రితం పెద్దేముల్ మండల కేంద్ర శివారులో మృతదేహంగా లభించిన మహిళ మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. శనివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్, ఎస్ఐలు శ్రీధర్ రెడ్డి, గిరిలతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోధ(35) పరిగి పట్టణంలో కూలీ పనులు చేస్తుండేంది. ఆమెకు పరిగి మండలం రాంరెడ్డిపల్లికి చెందిన పల్యా అనితతో పరిచయం ఉంది. అనితకు దోమ మండలం బోలా గోపాల్ అనే వ్యక్తితో వి వాహేతర సంబంధం ఉంది. అయితే అనిత వద్ద యశోధ కొంతకాలం క్రితం రూ. 6వేలు అప్పుగా తీసుకుంది. అనిత ఎప్పుడు అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని కక్ష పెంచుకుంది.

హత్యకు పథకం
ఎలాగైనా యశోధను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దక్కించుకునేందుకు పథకం వేసింది. యశోధను హత్య చే ఎందుకు ప్రియుడు గోపాల్ సాయం కోరింది. ఇందుకు అనిత తనతో ఉంటేనే హత్యకు సాయం చేస్తానని గోపాల్ తెలిపాడు. ఈ క్రమంలో ఈనెల 1వ తేదిన గోపాల్ యశోధకు ఫోన్ చేసి అనితకు ఇవ్వాల్సిన డబ్బులు విషయం గురించి మాట్లాడుదామని.. పరిగి బస్టాండ్ వద్దకు రప్పించాడు. అక్కడి నుంచి గోపాల్, అనిత, యశోధలు బైకుపై వికారాబాద్ వైపు వచ్చారు. మార్గ మద్యలో మద్యం సేవించారు.

యశోధకు మత్తు ఎక్కిన తరువాత అదే బైకుపై పెద్దేముల్ మండలం వైపు వచ్చారు. మార్గ మద్యలో ధారూర్ వద్ద పెట్రోల్ బంకులో ఓ బాటిళ్లో పెట్రోల్ వెంట తీసుకవచ్చారు. పెద్దేముల్ మండలం కోట్ పల్లి మార్గంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసువచ్చి యశోధను ఆమె చీరతో గొంతు నులిమి హత్య చేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ముఖం, ఛాతిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. అంతకుముందు యశోధ మెడలో బంగారు నల్లపూసలు, బంగారు ముక్కు పుడకలు, వెండి కాళ్ల కడియాలు, సెల్ ఫోన్ తీసుకున్నారు. అనంతరం ఆక్కడి నుంచి బైకు పై పరారయ్యారు.

దొరికిపోయారు ఇలా..
మరుసటి రోజు యశోధ మృతదేహాన్ని పోలీసులు సామాజిక మాధ్యామాలలో వైరల్ చేయగా మృతురాలి కుమారుడు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. వారి ద్వారా అనుమానం ఉన్న నిందితులపై నిఘా ఉంచారు.

శనివారం నిందితులు గోపాల్, అనితలు మృతురాలి నుంచి తీసుకున్న బంగారు ఆభరణాలను హైదరాబాద్లో విక్రయించేందుకు వెళుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి బంగారు నల్లపూసలు, బంగారు ముక్కు పుడకలు, వెండి కాళ్ల కడియాలు, సెల్ ఫోన్, బైకులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు వివరించారు. ఈ కేసులో చేధనలో ప్రతిభ కనబరిచిన రూరల్ సీఐ నగేష్, పెద్దేముల్ ఎస్ఐఐ శ్రీధర్ రెడ్డి, యాలాల ఎస్ఐ గిరి, ఏఎస్ఐ బక్కన్న, హెడ్ కానిస్టేబుల్ రమేష్, క్రైం వింగ్ స్టాఫ్ దస్తప్ప, ప్రతాప్ సింగ్, నర్సింహా, మున్నయ్య, జయంత్, మాసయ్య, రఫీక్, అశోక్ లను ఎస్పీ నారాయణ రెడ్డి అభినందించారు.

ఇదికూడా చదవండి…

సామాజిక శక్తి బాబు జగ్జీవన్ రామ్..!