వైద్యం.. మారుతోంది..!

ఆరోగ్యం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

వైద్యం.. మారుతోంది..!
– జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త సేవలు
– ఇక నుంచి ఆ ఆపరేషన్లు ఇక్కడే
– వైద్య సేవల మార్పుకు కారణం ఇదే..
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందించే సేవల్లో భారీ మార్పులు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న సేవలతో కొత్త వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. చాలా కాలంగా ఇక్కడ ప్రజలకు అందుబాటులోలేని శస్త్ర చికిత్సలు కూడా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ప్రతి రోజూ వందల మంది వస్తుంటారు. తాండూరుతో పాటు వికారాబాద్, కోడంగల్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు.
kvcs

మెడికల్ కాలేజీగా జిల్లా ఆసుపత్రి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు సంగతి అందరికి తెలిసిందే. కాలేజీకి అనుమతులు కూడా వచ్చాయి. కొడంగల్‌లో రూ.27 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల కొత్త భవన నిర్మాణం కొనసాగుతోంది. అప్పటివరకు కళాశాలను తాండూరు జిల్లా ఆస్పత్రిలో నిర్వహించనున్నారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో కొనసాగించేందుకు ఇప్పటికే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధీనంలోకి తీసుకుంది. అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ప్రొఫెసర్లు విధుల్లో చేరగా, బోధన నిపుణులు త్వరలో రానున్నారు. కొడంగల్‌ వైద్య కళాశాలకు 50 వైద్య సీట్లు కేటాయిస్తూ జాతీయ వైద్య కమిషన్‌ నిర్ణయించింది. తాజాగా జరుగుతున్న కౌన్సెలింగ్‌లోనే విద్యార్థులు ఇక్కడికి రానున్నారు. ఆల్‌ ఇండియా, రాష్ట్ర కోటాలో మొత్తం సీట్లు భర్తీ చేయనున్నారు.

వైద్య సేవల్లో వచ్చే మార్పులు ఇవే..
అత్యవసర, ప్రత్యేక చికిత్సలు అవసరమైతే జిల్లా ప్రజలు హైదరాబాద్‌కు పరుగులు తీసేవారు. మెరుగైన వైద్యం అందాలంటే ప్రైవేటుకో లేక ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపించేవారు. ఇక నుంచి ఈ కష్టాలు దూరం కానున్నాయి. తాండూరు జిల్లా ఆస్పత్రిలోనే అత్యవసర, వివిధ రకాల ప్రత్యేక సేవలు అందనున్నాయి. ఇందుకోసం దవాఖానాకు అవసరమైన పరికరాలు, లిఫ్టింగ్‌ మంచాలు, రోగ నిర్ధారణ, చికిత్సలకు అత్యాధునిక పరికరాలు, సౌకర్యాలను సమకూర్చారు. ఆచార్యులు, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అందించే శస్త్రచికిత్సలు తాండూరులోనే అందనున్నాయి. చిన్నారులు, ఫిజియోథెరపీ, కళ్లు, చెవి, ముక్కు, గొంతు, కిడ్నీ, ఎముకలు, మహిళా సంబంధమైన చికిత్సలు, మానసిక, మెదడు, నరాలు, వివిధ రకాల ప్రత్యేక శస్త్రచికిత్సలు, అవసరమైన రక్త పరీక్షలు, అన్ని రకాల చికిత్సలు జరగనున్నాయని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి….

కీరదోస.. ఆరోగ్యానికి భరోసా..!