పుర తీర్పు ఎవరి వైపో..!
– తాండూరులో హంగ్‌కు చాన్స్ కరువే
– పుర ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ
– సోషల్ మీడియాలో ఎవ్వరి లెక్కలు వారే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో పుర పోరు ఫలితాలు ఏకపక్షంగా వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల తీర్పు హస్తం వైపే వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాండూరు మున్సిపాల్టీలో కూడా ఇవే పరిణాలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి తాండూరులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ అనేలా కొనసాగింది. ఎన్నికల పర్వం ముగిసినా కూడా గెలుపు ఎవరి వైపో తేలడం లేదు. తాండూరులోని 36వ వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలతో పాటు స్వతంత్ర, జనసేన పార్టీల అభ్యర్థులు పోటీ పడినా కూడా ప్రధాన పోరు రెండు పార్టీల మద్యనే కొనసాగింది. బుధవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఓటింగ్ శాతం అంతంత మాత్రంగానే నమోదు కావడం అందరిని కలవరానికి గురిచేసింది. పోలింగ్ సరళిని అంచనా వేసిన పార్టీలు, రాజకీయ విశ్లేషకులు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ లెక్కలేసుకోవడం మొదలు పెట్టారు.

గురువారం మధ్యాహ్నం తాండూరులోని సోషల్ మీడియాలలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సాధించే సీట్లను ఎగ్జిట్ పోల్ వివరాలను వైరల్ చేయడం కనిపించింది. ఒకరు కాంగ్రెస్ పార్టీకి 17 నుంచి 20 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 15 నుంచి 17 సీట్లు, బీజేపీకి 2నుంచి 3సీట్లు, ఎంఐఎం 2, స్వతంత్రులు 1సీటు చొప్పున అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి తాండూరు మున్సిపల్‌లో హంగ్ ఏర్పడే చాన్స్ లేదని తేలుస్తున్నారు. మున్సిపల్ పుర పోరులో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయని, చైర్మన్ పీఠాన్ని ‘హస్త’గతం చేసుకోబోతుందని సంకేతాలు ఇస్తున్నారు. శుక్రవారం కౌంటింగ్ పూర్తయితే గాని పుర తీర్పు ఎవరి వైపు వస్తుందే ఉత్కంఠకు ఎండింగ్ పడే చాన్స్ లేదు. కాంగ్రెస్, వర్సస్ బీఆర్ఎస్ సాగిన పురులో గెలుపు ఎవరిదో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

ఇదికూడా చదవండి….

