కేసులు పెట్టె సంకృతి తెస్తుంది కాంగ్రెస్సే..!
– ఎమ్మెల్యే తప్పును కప్పిపుచ్చేందుకు మాజీ ఎమ్మెల్యేపై అబండాలు
– రోహిత్ రెడ్డి అరెస్టు చేస్తే తాండూరు నిర్బంధం చేస్తాం
– పైలెట్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలి
– ఎమ్మెల్యే, సోదరునిపై చర్యలు తీసుకోవాలి
– మీడియా సమావేశంలో తాండూరు బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గతంలో ఎన్నడు లేని విధంగా మాజీలపై కేసులు పెట్టే సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీసుకవస్తుందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించారు. మంగళవారం తాండూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి తదితరులు మీడియాతో మాట్లాడారు.

ఈనెల 13న జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ నేతలు లేనిపోని అబండాలు వేస్తున్నారని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అనచరులతో లోపలికి వెళ్లడాన్ని ప్రశ్నించేందుకే రోహిత్ రెడ్డి కేంద్రానికి వచ్చారని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలీసులు ఎలా అనుమతించారని రోహిత్ రెడ్డి ప్రశ్నించడం జరిగిందన్నారు. దీనిపై రోహిత్ రెడ్డి, 9 మంది నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన కరుణం పురుషోత్తం రావు, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తదితరులతో పాటు ఈనెల 11న వార్డు నెంబర్ 23లో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డిపై మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

దీనిపై పోలీసులు స్పందించాలని డిమాండ్ చేశారు. 75ఏండ్లలో ఏ ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యేలపై అక్రమంగా, దౌర్జన్యంగా కేసులు పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు కలిసి తాండూరులో రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు మాజీలపై, ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెట్టే సంస్కృతిని తీసుకవస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో రోహిత్ రెడ్డిని అరెస్టు చేస్తే తాండూరును ఎక్కడిక్కడ నిర్బంధిస్తామని హెచ్చరించారు. రోహిత్ రెడ్డి, అనుచరులపై పెట్టి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, సోదరుడు, నేతలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్రాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పరిమళ, కౌన్సిలర్లు యోగానంద్, జావిద్, నాయకులు సంతోష్ గౌడ్, రాకేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.


