కౌన్ బనేగా కోఆప్షన్..!
– తాండూరులో సీనీయర్లకు ప్రాధాన్యం
– నలుగురిని నియమించే చాన్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో కోఆప్షన్ సభ్యుల నియామకంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పుడిప్పుడే మున్సిపల్ ఎన్నికల హడావుడి తగ్గింది. దీంతో రాజకీయంగా కోఆప్షన్ సభ్యులు ఎవరవుతారనే దానిపై చర్చించుకుంటున్నారు. తాండూరు మున్సిపల్‌లో నలుగురు సభ్యులను నియమించే అవకాశం ఉంది. మునిసిపాలిటీలలో కోఆప్షన్ సభ్యుల నియామకాన్ని దృష్టిలో ఉంచుకుని పురపాలక శాఖ రాష్ట్ర డైరెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. త్వరలోనే ఎంపిక జరిగే పరిణాలు కనిపిస్తున్నాయి. తాండూరులో కోఆప్షన్ సభ్యుల పదవుల కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు.

అవకాశం కోసం పలువురు కాంగ్రెస్ నేతలు జోరుగా సంప్రదింపులు చేస్తున్నారు. మైనార్టీ కోటాలో మాజీ కౌన్సిలర్ ఖవికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కావలి సంతోష్ కూడా కోఆప్షన్ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జన సమితి మిత్రపక్షంలో భాగంగా మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్‌కు కూడా కోఆప్షన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వార్డునెంబర్ 30లో తెదేపా తరపున పోటీ చేసిన సాజిదా ఖాతూన్‌కు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇటీవల కౌన్సిలర్ టిక్కెట్ల కేటాయింపులో అవకాశం లభించని ఇద్దరు మహిళలు కూడా కోఆప్షన్ పదవులను ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఎంపిక నిబంధనలు ఇవే…
మున్సిపల్ చట్టం ప్రకారం.. నగరపాలక సంస్థలలో ఐదు మంది, మున్సిపాలిటీల్లో నలుగురు కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి అవకాశం ఉంది. నలుగురు కో-ఆప్షన్ సభ్యులలో ఇద్దరు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులు ఉండాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.

ఈ ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉండాలి. మున్సిపల్ వ్యవహారాలలో అనుభవం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించుకునే అవకాశం ఉంది. వీరిలో కూడా ఒకరు మహిళ ఉండాలి. పాలకవర్గం ఏర్పడిన తరువాత రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ఉత్తర్వులు జారీ తరువాత కోఆప్షన్ సభ్యుల ఎంపికకు మునిసిపల్ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక మినహా ఇతర అంశాలను చేపట్టరాదు.

