ఇసుక మాఫియా ఎత్తుగడ..!
– పక్కా ప్లాన్‌తో ఇందిరమ్మ ఇళ్ల ఇసుక పక్కదారి
– తాండూరు కాగ్నానదిలో పోలీసుల దాడులు
– 10 ట్రాక్టర్లు పరార్, 30 ట్రాక్టర్ వివరాల ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేసినా ఇసుక మాఫియా కొత్త కొత్త ఎత్తుగడులు వేస్తూ దర్జాగా దోపిడికి పాల్పడుతున్నారు.

ఇటీవలే ప్రభుత్వం ఇసుక అనుమతులను ఆన్‌లైన్ విధానంలోకి మార్చిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో అనుమతులలో క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తేనే ఇసుక తరలించాలి. అయితే తాండూరులో కొందరు అక్రమార్కులు ఈ విధానాన్ని అమలు చేయకుండా అక్రమ రవాణాకు పాల్పడ్డారు. తాండూరు పట్టణం కాగ్నానదిలో రూరల్ పోలీసులు జరిపిన దాడుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దాడులతో సుమారు 10 ట్రాక్టర్లు పరారు కాగా.. 30 ట్రాక్టర్ల వివరాలను పోలీసులు ఆరా తీశారు. తాండూరు మండలం కోటబాస్పల్లి, మల్కాపూర్, జినుగుర్తి, మిట్టబాస్పల్లి తదితర గ్రామాల లబ్ధిదారులు ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. వారి వివరాలను సేకరించిన ఇసుక మాఫియా తాండూరు పట్టణం పాత తాండూరు కాగ్నానది నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు.

పొందిన అనుమతులకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయించుకుని ఇసుకను తరలించాలి. అక్రమార్కులు పొందిన అనుతులకు ప్రభుత్వం తీసుకవచ్చిన కొత్త విధానంలో 30రోజుల గడువును ఇచ్చారు. కాని ఇసుక మాఫీయా వీఆర్ఏల వద్ద స్కానింగ్ చేయకుండా ఇసుక తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రతి రోజూ క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయకుండానే పదుల సంఖ్యల్లో ఇసుకను తరలిస్తున్నారు. గురువారం ఈ సమాచారం అందుకున్న రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసుల రాకతో అప్పటి వరకు కాగ్నానదిలో 40 ట్రాక్టర్లు ఉండగా.. సుమారు 10 ట్రాక్టర్లు అక్కడి నుంచి పరారయ్యాయి. దీంతో సీఐ మిగతా 30 ట్రాక్టర్లకు సంబంధించిన అనుమతి పత్రాలను ఆరా తీశారు. సీఐ దగ్గర ఉండి క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయించి ఇసుక తరలించేలా చర్యలు చేపట్టారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసంతృప్తి
—————————————
కాగ్నానదిలో జరిగిన అక్రమ రవాణా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి వెళ్లింది. సమగ్ర వివరాలను తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈఎండీ, మైనింగ్ తదితర శాఖల అధికారులకు ఫోన్‌లో మాట్లాడి ఇందిరమ్మ ఇసుక అక్రమ రవాణాకు కట్టడి చర్యలు తీసుకోవాలని కోరారు.


