అతిసార నియంత్రణకు చర్యలు
– పాత తాండూరును సందర్శించిన ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో కలకలం రేపిన అతిసార నియంత్రణయకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ అధికారులు, వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మున్సిపల్ పరిధి పాత తాండూరును ఆర్డీఓ అశోక్ కుమార్ సందర్శించారు. అతిసార విజృంభణ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కొత్త కేసులు నమోదు కాకుండా ప్రజలకు ముందస్తు వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. తాగునీటిని కాచి వడిబోచిన తరువాత సేవించేలా అవగాహన కల్పించాలన్నారు.
లీకేజీ మరమ్మత్తుల పరిశీలన
మరోవైపు ఆర్డీఓ అశోక్ కుమార్ పాత తాండూరు – కాగ్నా మార్గంలో పైపులైన్ లీకేజీల మరమ్మత్తుల పనులను
పరిశీలించారు. రెండు రోజుల పాటు పట్టణంలో తాగునీటి సరఫరాలో అంతరాయం విధించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మరమ్మత్తుల పనులను వేగవంతం చేయాలన్నారు. లీకేజీలను పూర్తి చేసి గడువుకు ముందే తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓ వెంట మున్సిపల్ డీఈ రంగనాథం, మేనేజర్ బుచ్చిబాబు, శానిటరీ ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు.

