అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి..!
– యాలాల మండలలో ఘటన
– పోస్టు మార్టం కోసం మృతదేహాల తరలింపు
యాలాల, దర్శిని ప్రతినిధి : మండలంలోని కోకట్ గ్రామ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు, దెబ్బల ఆనవాళ్లు లేకపోవడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోకట్ పరిధిలోని సుమిత్‌కు చెందిన స్టోన్ పాలిష్ మిషన్ యూనిట్ గదిలో వరుసకు మామ, అల్లుడైన అబ్దుల్ లయాఖత్ (45), గోరెప్ప (32) నివాసముంటున్నారు. సోమవారం రాత్రి భోజనం అనంతరం మద్యం సేవించి నిద్రించిన వీరు.. మంగళవారం ఉదయానికి మృతి చెంది కనిపించారు.

మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు, దెబ్బలు లేవని పోలీసులు తెలిపారు. మృతికి గల కచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ విఠల్ రెడ్డి తెలిపారు. మరోవైపు సంఘటన స్థలాన్ని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పరిశీలించారు.


