కౌన్సిలర్ పనితీరుపై భార్య ‘సర్వే’..!
– ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయ సేకరణ
– జావిద్ పాలనపై స్థానికుల మద్దతుపై హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని 8వ వార్డులో కౌన్సిలర్ జావిద్ పనితీరుపై ఆయన సతీమణి నజియా ప్రజల వద్దకు అభిప్రాయాలను సేకరించారు.

“మా ఆయన పని చేస్తున్నారా..? మీ సమస్యలు పరిష్కరిస్తున్నారా..?” అంటూ ఇంటింటికి వెళ్లి స్వయంగా ఆరా తీయడం అసక్తికరంగా మారింది. తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు బీఆర్ఎస్ నుంచి జావిద్ కౌన్సిలర్‌గా ఉన్నారు. కౌన్సిలర్‌గా గెలిచిన నాటి నుంచి ఆయన పనితీరు ఎలా ఉందని ఆరా తీసేందుకు గురువారం సతీమణి నజియా కాలనీలో పర్యటించారు.

వార్డులో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, రోడ్ల పరిస్థితి, చెత్త నిర్వహణ తదితర అంశాలపై స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. కౌన్సిలర్ అందుబాటులో ఉంటున్నారా? సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తే స్పందన ఎలా ఉంది? అనే విషయాలపైనా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ముఖ్యంగా అసరా ఫించన్ల లబ్దిదారులకు ఎలాంటి సేవలను అందిస్తున్నారు.. ఎన్నికల ముందు హామి ఇచ్చిన విధంగా పనిచేస్తున్నారా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వార్డులో అవసరమైన చోట సొంత నిధులతో రోడ్ల మరమ్మతులు, చెత్త డబ్బాల ఏర్పాటు వంటి పనులు చేపట్టడంతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని జావిద్ తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నామని నజియా పేర్కొన్నారు. కౌన్సిలర్ తరఫున ఆయన సతీమణి నేరుగా ప్రజల్లోకి వెళ్లి పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకోవడం రాజకీయంగా ఆసక్తిగా మారింది.


