తాండూరు విద్యార్థుల సత్తా
– వరల్డ్ ఓపెన్ తైక్వాండలో 12 పతకాలు
– సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్ విద్యార్థుల ఘనత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు.

ఈ నెల 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. 15 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో తాండూరు సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.

పోటీల్లో తాండూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఒక బంగారు, ఐదు వెండి, ఆరు కాంస్య పతకాలు సాధించి మొత్తం 12 పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, పతకాలను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రె.షా. మాదాను జోసెఫ్ విద్యార్థులను, కోచ్ టి.పురుషోత్తంను అభినందించారు. విద్యార్థులు సత్తా చాటడం స్కూల్‌కే కాదు తల్లిదండ్రులకు, తాండూరుకు గర్వకారణమన్నారు. విజేతలు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తాండూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి.. విద్యార్థులను అభినందించారు.


