ఆర్టీసీలో హోరా.. హోరీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీలో హోరా.. హోరీ..!
– ప్రశాంతంగా యూనియన్‌ ఎన్నికల పోలింగ్‌
– తాండూరులో ముగ్గురు అభ్యర్థుల బరి
– ఉదయం నుంచే ఓటింగ్‌ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ హోరా హోరీగా కొనసాగుతోంది.

దాదాపు పదేళ్ల తరువాత ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎన్నికలు జరుగుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం తాండూరు ఆర్డీసీ డీపోలో ఉదయం 5గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమయ్యింది. ఈ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసి సహాకారంతో టీడబ్ల్యూయూ తరుపున నవీన్‌ గౌడ్‌ (బాణం గుర్తు), ఏఐటీయూసీ సహాకారంతో ఈయూ తరఫున సుదర్శన్‌ (బస్సు గుర్తు), టీజేఎంయూ ఒంటరిగా యాదయ్య (గద గుర్తు) పోటీలో ఉన్నారు.

డిపో పరిధిలో మొత్తం 334 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8:30 గంటల వరకు 97 మంది ఓటు వేసినట్లు సమాచారం. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండటంతో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

తాండూరు డీపోలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరోవైపు పలు యూనియన్ల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టిసి విలీనమే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పలు యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

పండగ వేళ పస్తులుండాల్సిందేనా..!