పండగ వేళ పస్తులుండాల్సిందేనా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పండగ వేళ పస్తులుండాల్సిందేనా..!
– వేతనాల కోసం మున్సిపల్‌ కార్మికుల దర్నా
– పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైటాయింపు
– మరో 5మందికి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌
– కార్మికులతో చర్చించిన చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– సమస్య పరిష్కారానికి హామీ.. విధుల్లోకి తిరిగి చేరిన కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగ సమయంలోనైనా వేతనాలు అందకపోవడంతో మున్సిపల్‌ కార్మికులు ఆందోళన బాట పట్టారు. నెలంతా పనిచేసినా జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే తాండూరు పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఒకటో తేదీ తరువాత వేతనాలు చెల్లించాలని అధికారులను కోరుతున్నా స్పందన లేదని కార్మికులు ఆరోపించారు.

పండగ వేళ కుటుంబ ఖర్చులు, నిత్యావసరాల కొనుగోళ్లకు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. విధులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నా వేతనాల కోసం ఆందోళన చేయాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. అదేవిధంగా తమ వేతనాల చెల్లింపుతోపాటు తమతో కలిసి పనిచేస్తున్న మరో ఐదుగురు కార్మికుల సమస్యనూ పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

గత కొన్నేళ్లుగా వారితోనూ పనులు చేయించుకుంటున్నారని, అయినప్పటికీ వారికి వేతనాలు అందడం లేదని ఆరోపించారు. కార్మికుల ధర్నా విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. వేతనాల చెల్లింపులో ఎదురవుతున్న సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమతోపాటు పనిచేస్తున్న మరో ఐదుగురి వేతనాల సమస్యను కూడా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. చైర్‌పర్సన్‌తో చర్చలు సఫలం కావడంతో కార్మికులు ఆందోళన విరమించి తిరిగి విధుల్లోకి చేరారు. వేతనాల సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సమాన పని.. సమాన స్టైపెండ్‌ ఇవ్వాలి..!