ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ప్రభంజనం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ప్రభంజనం
– తాండూరులో 190 ఓట్ల మెజారిటీ
– 97 శాతం ఓటింగ్‌తో కార్మికుల తీర్పు
– సంబరాలు జరుపుకున్న నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ) ఘన విజయం సాధించింది.

కార్మికుల మద్దతుతో ప్రత్యర్థులపై 190 ఓట్ల మెజారిటీని సాధించి సత్తా చాటింది. ఎన్నికల్లో మొత్తం 330 మంది ఉద్యోగులకు గాను 321 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. దాదాపు 97 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా తాండూరు డిపోలో ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఓటు వేసేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో డిపో పరిధిలో ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం వెలువడిన ఫలితాల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ మద్దతుతో బరిలో నిలిచిన టీడబ్ల్యూయూ విజయంతో యూనియన్‌ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి అంశాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని యూనియన్‌ నాయకులు పేర్కొన్నారు.

యూనియన్ల వారీగా ఓట్ల వివరాలు
తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ)
తాండూరు డిపోలో మెజారిటీ: 190 ఓట్లు
రాష్ట్రస్థాయిలో వచ్చిన ఓట్లు: 247
ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ)
తాండూరు డిపోలో వచ్చిన ఓట్లు: 57
రాష్ట్రస్థాయిలో వచ్చిన ఓట్లు: 224
తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ)
తాండూరు డిపోలో వచ్చిన ఓట్లు: 12
రాష్ట్రస్థాయిలో వచ్చిన ఓట్లు: 11

 

వైభోగం దుర్గమ్మ ఆగమనం..!