క‌రోనా టెస్టుల‌కు క్లారీటీ..!

ఆరోగ్యం తెలంగాణ హైదరాబాద్

క‌రోనా టెస్టుల‌కు క్లారీటీ..!
– మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చిన ఐసీఎంఆర్
– ఎవ‌రు చేయించుకోవాలి, ఎవ‌రికి వ‌ద్ద‌నే దానిపై స్పష్ట‌త
ద‌ర్శిని హెల్త్ : ఓమిక్రాన్‌, క‌రోనా వైర‌స్ వ్యాప్తిలో అనారోగ్యానికి గురైన వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలో లేదో అనే ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఒక‌ప్పుడు పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తితో సంబంధం ఉన్న వారు ప‌రీక్ష‌ల‌కు ఎగ‌బ‌డాల్సి వ‌చ్చేది. ప్ర‌స్తుతం అలాంటి వారికి కరోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలా వ‌ద్దే అనే విష‌యాల‌పై ఇండియ‌న్ కౌన్సిల్ ఆప్ మెడిక‌ల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) క్లారిటీ ఇచ్చింది. కోవిడ్ పరీక్షకు సంబంధించి కొత్త మార్గదర్శాకాలను జారీ చేసింది. ఈ మేర‌కు రిస్క్ కేటగిరీలో ఉంటే తప్ప, కరోనా సోకిన వారితో పరిచయం ఉన్న వ్యక్తులను పరీక్షించాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేసింది. క‌రోనా టెస్టుల విష‌యంలో ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. అవేంటో ఇక్క‌డ చూద్దాం..!

ఈ ల‌క్ష‌ణాలు ఉంటే ప‌రీక్ష‌లు
క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిలో కొన్ని అనారోగ్య సూచ‌న‌లు క‌నిపిస్తాయి. గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, దగ్గు, జ్వరం సమస్యలు ఉన్నవారితో పాటు రుచి.. వాసన కోల్పోయిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అదేవిధంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న 60 ఏళ్ల వారితో పాటు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పరీక్షించవచ్చు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి ప‌రీక్ష‌లు త‌ప్ప‌ని స‌రి. మ‌రోవైపు భార‌తీయ విమానాశ్ర‌యాలు, ఓడ‌రేవుల‌కు వ‌చ్చే విదేశీ ప్ర‌యాణికుల‌కు, అంత‌ర్జాతీయంగా ప్ర‌యాణించే వారికి నిబంధ‌న‌ల మేర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది.

ఎవ‌రికి అవ‌స‌రం లేదంటే..
వ్యాధి సోకిన వ్యక్తి పరిచ‌య‌స్తులు వారి ఆరోగ్య ప‌రిస్థితులు అనుకూలంగా ఉంటే పరీక్షించాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్ లక్షణాలు లేని వ్యక్తులకు పరీక్షలు చేసుకోవాల్సిన‌ అవసరం లేదు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి పూర్తిగా కోలుకున్న వారు ప‌రీక్ష‌లు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. దీంతో పాటు కోవిడ్ సెంటర్‌లో చేరి డిశ్చార్జ్ అయిన రోగులు కూడ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిన అవ‌స‌రం లేని జాబితాలోకి వ‌స్తారు.