ధ్యానంతో పరమశివుని కృప
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– బ్రహ్మకుమారి సమాజంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శివున్ని పరమభక్తితో ధ్యానం చేస్తే కృపాకటాక్షాలు సిద్దిస్తాయని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం మహా శివరాత్రిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని బ్రహ్మకుమారి సమాజంలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సమాజం ప్రతినిధి జగదేవీ ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగానే నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్‌లతో కలిసి చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ సమాజం జెండాను ఆవిష్కరించారు. అనంతరం శివ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మనిషి తన ఆత్మ లోనే పరమాత్ముడు ఉన్నాడని అది ధ్యానంతో సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు. బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనియాడా అభినందించారు. మరోవైపు సమాజం సభ్యులు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో పాటు అథితులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రతినిధులు, వార్డు ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

