తాండూరు బైపాస్ రూటు మార్చండి
– ఈద్గా మైదానానికి ఇబ్బందులు
– ఆర్అండ్‌బీ శాఖ మంత్రికి కోరిన మైనార్టీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బైపాస్ రోడ్డు మార్గాన్ని మార్చాలని తెలంగాణ రాష్ట్ర ఆర్అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని తాండూరు మైనార్టీ నాయకులు కోరారు. మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని రాష్ట్ర రవాణా శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, నాయకులు మసూద్, ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్ ఖాన్‌లు కలిసి వినతిపత్రం
అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాను మంత్రిగా ఉన్న సమయంలో తాండూరుకు మంజూరైన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని మంత్రికి వివరించారు. అయితే ఈ రోడ్డు మార్గం చెన్‌గెష్‌పూర్ రోడ్డుమార్గంలోని ముస్లిం పవిత్ర ఈద్గా మైదానం మీదుగా వెళుతుందని వెల్లడించారు. ఈద్గా మీదుగా నిర్మాణం జరిగితే ముస్లింలకు ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. ముస్లింలకు, ఈద్గా మైదానంకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బైపాస్ రోడ్డు రూటును మార్చాలని కోరారు. ఈ మార్పును తప్పనిసరిగా చేయాలని ఎమ్మెల్సీతో పాటు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించి రూటు మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. అదేవిధంగా నాయకులు ఆర్అండ్‌బీ శాఖ అధికారి గణపతిరెడ్డిని కలిసి బైపాస్ రోడ్డు మార్పుకోసం చర్యలు తీసుకోవాలని కోరారు.
