కుర్చీకెక్కిన ప్రోటోకాల్..!
– చెక్కుల పంపిణీలో అమలు చేసిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో ప్రోటోకాల్ సృష్టించిన వివాదం అంతా ఇంత కాదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల మద్య వర్గపోరును మరోసారి భగ్గుమనిపించింది. రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అదికాస్త అధికారుల సమన్వయలోపమనే రంగును అద్దుకుంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. గురువారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కుల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం వేదికపై ప్రోటోకాల్ కుర్చీలపైకి ఎక్కింది. సభావేధికపై ఏర్పాటు చేసిన కుర్చీలకు అధికారులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు సంబంధించిన కుర్చీలకు స్టిక్కర్లను అంటించి ప్రోటోకాల్ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇదిచూసిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇదేవిధంగా ప్రోటోకాల్‌ను అమలు చేసేలా చూస్తే ఎలాంటి వివాదాలు ఉండవనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

