ఆ ఉద్యోగాల‌కు నేటితో ముగుస్తున్న ద‌ర‌ఖాస్తుల గ‌డువు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఆ ఉద్యోగాల‌కు నేటితో ముగుస్తున్న ద‌ర‌ఖాస్తుల గ‌డువు
– రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల కోసం పోలీసు, ఎక్సైజ్ శాఖ‌, అగ్నిమాప‌క శాఖ‌ల ఖాళీల భ‌ర్తికోసం విధించిన ద‌ర‌ఖాస్తుల గ‌డువు నేటితో ముగియ‌నుంది. నేడు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. శాఖ‌ల వారిగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన పోస్టులు, ఖాళీల వివ‌రాల‌ను మ‌రోసారి ప‌రిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17,516 పోలీస్ కొలువులకు 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిల్లో భారీ మొత్తంలో 16,614 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉండగా, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 587దాకా ఉన్నాయి. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులెవరైనా ఉంటే అధికారిక వెబ్సైట్ www.tslprb.inలో ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మంట్ బోర్డు ఈ సందర్భంగా సూచించింది.

ఎక్సైజ్ శాఖ‌లో…
హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ (TS Excise and transport) విభాగాల్లో 677 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 614 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభంకాగా.. నేటితో (మే 26) దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులెవరైనా ఉంటే వెంటనే అధికారిక వెబ్సైట్ www.tslprb.inలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ సందర్భంగా సూచించింది.

అగ్నిమాప‌క శాఖ‌లో…
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న 225 డ్రైవర్ ఆపరేటర్ (Driver Operator) పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) మే 20న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంటే ఈ రోజుతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందన్న మాట. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. యూనీఫాం ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి అయిదేళ్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది కూడా. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది.