నైసుగా నకిలీ మోసం..!
– పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యాపారి అరెస్టు
– టాస్క్‌ఫోర్స్ దాడుల్లో 10 క్వింటాళ్ల పత్తి విత్తనాలు
– 20 బస్తాల స్వాదీనం, పరారీలో ఇద్దరు నిందితులు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : రైతుల మెడకు నైసుగా నకిలీ విత్తనాల గాలం వేస్తున్నకేటుగాడిని వికారాబాద్ జిల్లా పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందం మంగళవారం 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి హాజరై కేసు వివరాలను వెల్లడించారు. మంగళవారం సాయంత్రం సిద్దులూర్ గ్రామములో బస్టాండు వద్ద జిల్లాలోని యాలాల మండలం సంగెంకుర్దు గ్రామానికి చెందిన గంజిపల్లి శ్రీనివాస్ అనే వ్యాపారి రైతులకు లూసుగా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సీఐ వెంకటేషం వికారాబాద్ సీఐ రాజశేఖర్, వికారాబాద్ మండల వ్యవసాయ అధికారి పాండురంగా, సిబ్బందితో కలిసి దాడులు చేసి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో లోతుగా విచారణ జరిపారు. ఈ క్రమంలో అతని స్వగ్రామము సంగెంకుర్దులో ఉన్న శ్రీనివాస్ ఇంటి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో గుట్టుగా నిల్వ ఉంచిన దాదాపు 10 క్వింటాళ్ళ నకిలి పత్తి విత్తనాలను గుర్తించారు. 20 బస్తాలలో వీటిని నిల్వ చేసి ఉంచి.. వివిధ ప్రాంతాలలో విక్రయానికి పాల్పడుతున్నట్లు తనిఖీలో వెల్లడైంది. వీటి విలువ సుమారుగా రూ.,12,24,000/-లు ఉంటుందని నిర్దారించారు.
అయితే అతను ఈ నకిలీ పత్తి విత్తనాలను జిల్లాలోని కోడంగల్ మండలం పర్సాపూర్‌లోని రఘు అనే వ్యాపారితో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన క్రిష్ణా చౌదరిల నుంచి దిగుమతి చేసుకున్నట్లు తేలింది. దీంతో గంజిపల్లి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇతనిపై యాలాల, తాండూరు మండలాల్లో కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. పీడీ యాక్టు కేసు కూడ నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా రఘు, క్రిష్ణ చౌదరిలు పరారిలో ఉన్నారని, అయినా వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. త్వరలోనే వారిని కూడ అదుపులోకి తీసుకుంటామన్నారు.
రైతులను వంచించొద్దు : ఎస్పీ కోటిరెడ్డి
మరోవైపు నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి సూచించారు. వ్యాపారులు కూడ మానవ మనుగఢకు పాటుపడుతున్న రైతులను వంచించి మోసం చేయొద్దన్నారు. రైతులను మోసం చేసే వ్యాపారులపై పోలీసులకు సమాచారం అందించాలని, అవసరమైన సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు, పీడీయాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


