తట్టేపల్లి మండలంకు ప్ర‌య‌త్నం ఆప‌ను

తాండూరు రాజకీయం వికారాబాద్

తట్టేపల్లి మండలంకు ప్ర‌య‌త్నం ఆప‌ను
– ఆ నిబంధ‌న‌ల‌తోనే ఏర్పాటుకు దూరం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దేముల్ మండ‌లంలోని త‌ట్టెప‌ల్లిని కొత్త మండ‌లంగా ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తాన‌ని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పాల‌న సంస్క‌ర‌ణ‌లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం పలు జిల్లాలలో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. కొన్ని నిబంధ‌న‌ల కార‌ణంగా నియోజ‌క‌వ‌ర్గంలోని త‌ట్టెప‌ల్లి కొత్త మండ‌లంగా అవ‌త‌ర‌ణ‌కు అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను సీఎం కేసీఆర్ స్వ‌యంగా వెల్ల‌డించిన‌ట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే మండలాల్లో కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా 7 ఎంపిటిసి స్థానాలు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందని.. అయితే తట్టేపల్లి మండల పరిధిలోకి కేవలం మూడు(తట్టేపల్లి, అడికిచెర్ల, పాషాపూర్) ఎంపిటిసి స్థానాలు మాత్రమే ఉండ‌డంతో తట్టేపల్లిని కొత్త మండలం చేయలేకపోతున్నట్లు సీఎం తెలిపార‌ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. అచ్చంగా గిరిజన గ్రామాలతో కూడిన తట్టేపల్లి ప్రాంతంను కొత్త మండలం చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తానని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఈ విషయాన్ని చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు. తట్టేపల్లి ప్రాంతంను మండలంగా మార్చేందుకు జిల్లా మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.