వాగులో రైతు గల్లంతు
– గట్టెక్కిన మరో ఇద్దరు రైతులు
– మోమిన్‌పేట్‌లో సంఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రమాద వశాత్తు వాగులో పడిన ఓ రైతు గల్లంతు కాగా మరో ఇద్దరు రైతులు గట్టెక్కారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం టేకులపల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండగళ్ల అంజయ్య(55), నాగయ్య, సత్యనారాయణలు మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. పనులు ముగించుకు వస్తుండగా అయ్యమ్మ చెరువు అలుగు ఉదృతంగా ప్రవహించింది. ప్రమాద వశాత్తు ముగ్గురు వాగులో పడిపోయారు. నాగయ్య వీపుపై పురుగుల మందు డబ్బా ఉండడంతో దాని సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు, సత్యనారాయణ కొట్టుకుపోయే క్రమంలో చెట్టును పట్టుకుని ఒడ్డుకు చేరుకున్నారు. అయితే అంజయ్య మాత్రం వాగులో కొట్టుకుపోయాడు. ఈ విషయం గమనించిన స్థానిక రైతులు పోలీస్ రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వికారాబాద్ డిఎస్పి సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రేపు రిస్క్ టీం సహాయంతో సహాయక చర్యలు చేపడతామని తెలిపారు.



