నిమజ్జనంలో నిర్లక్ష్యం చేయొద్దు
– అన్ని శాఖల అధికారులు అప్రమత్తం కండి
– కాగ్నానది, భద్రేశ్వర చౌరస్తా వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
– అధికారులతో తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వచ్చే వినాయక నిమజ్జనంలో అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ సూచించారు. శుక్రవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, మెడికల్, ఫైర్ శాఖలతో పాటు హిందూ ఉత్సవ సమితి సభ్యులతో నిమజ్జన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆదివారం జరిగే నిమజ్జన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక రోజు ముందు పట్టణంలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా భద్రేశ్వర చౌరస్తా, కోకట్ కాగ్నా నది వద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే తక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని అగ్నిమాపకశాఖ అధికారుల ఆదేశించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా వైద్య సేవలు అవసరమైతే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా శాఖలతో పాతు హిందూ ఉత్సవ సమితి సభ్యులు సమన్వయంతో నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, ఎక్సైజ్ ఇంచార్జ్ సీఐ చంద్రకాంత్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు బోయరాజు, పూజారి పాండు, పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


