జ్వర పరీక్షలు తప్పనిసరి..!
– స్కూల్, అంగన్‌వాడీల వద్ద ఆర్టీపీసీఆర్ పరీక్షలు
– ఎఎన్ఎం, ఆశ వర్కర్ల బృందాల ఏర్పాటు
– త్వరలోనే ఆర్టీపీసీఆర్ సెంటర్ల ప్రారంభం
– అధికారులతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
దర్శిని ప్రతినిధి: స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు హజరయ్యే విద్యార్థులకు జ్వర పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల సూచించారు. ఇందుకోసం ఏఎన్ఎం, ఆశా వర్కర్లను నియమించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. గురువారం స్థానిక డీపీఆర్సీ భవనంలో జిల్లా కలెక్టర్ నిఖిల శాఖల వారిగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు జ్వర పరీక్షలు నిర్వహించాలన్నారు. స్కూళ్లు, అంగన్‌వాడి కేంద్రాల థర్మల్ స్కానర్‌లను ఉంచాలన్నారు. ప్రతి విద్యార్థికి గేట్ వద్ద జ్వరం పరీక్ష నిర్వహించిన తరువాతే అనుమతించాలన్నారు. జ్వరం ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి, కోవిడ్ లక్షణాలు ఉంటే ఆ విద్యార్థిని అతని ఇంటివద్ద ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలు అందించినట్లయితే ఇతర విద్యార్థులకు సోకకుండా సురక్షితంగా ఉంచవచ్చన్నారు. అదేవిధంగా జిల్లాకు మంజూరైన ఆర్టీపీసీఆర్ సెంటర్‌ను రెండు రోజులలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వీటీ ప్రారంభోత్సవ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించాలన్నారు. గ్రామ పంచాయతీ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మరోవైపు జిల్లాలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలలు, పాఠశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు సకాలంలో స్కాలర్ షిప్పులు అందేలా చూడాలన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా..
అదేవిధంగా రైతులకు అవసరాల నిమిత్తం ఖరీఫ్ సీజన్ కోసం ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతు బంధు పథకం ప్రతి రైతుకు అందేలా చూడాలన్నారు. జిల్లాలో గల 1196 చెరువులు, ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. అంతేకాకుండా జిల్లాలో గొర్రెల పెంపకం కొరకు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ విద్యుత్, హార్టికల్చర్, మైన్స్ తదితర శాఖలపై సమీక్షించారు.
సాకులు చెప్పొద్దు..
అధికారులు అందరు రోజు వారిగా చేపట్టిన పనులను నిర్నిత పార్శాల్లో ప్రతిరోజు తన వాట్సాప్ కు పంపించాలని సూచించారు. ప్రతి పని పూర్తి నిబద్దతతో చేయాలని, ఇందులో ఏలాంటి పాకులు చెప్పకూడదన్నారు. అయితే అయ్యిందని… లేకుంటే కాలేదని చెప్పాలని.. కాకపోవడానికి కారణాలు తెలిపి.. సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్చీ నీశ జానకిరెడ్డి లతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.