సొంత పార్టీ ఎమ్మెల్యేపై విమ‌ర్శ‌లా..

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

సొంత పార్టీ ఎమ్మెల్యేపై విమ‌ర్శ‌లా..
– ఎమ్మెల్సీపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం
– తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు చేయ‌డం సమంజ‌సం కాద‌ని తాండూరు వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటి విఠ‌ల్ నాయ‌క్ అన్నారు. ఇటీవ‌ల టీఆర్ఎస్ఎల్‌పీలో జ‌రిగిన స‌మావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కించపరుస్తూ అస‌త్య ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేపై మహేందర్ రెడ్డి విమ‌ర్శ‌లు చేయ‌డం సమంజ‌సం కాద‌న్నారు. మ‌హేంద‌ర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకుడిలా మాట్లాడుతున్నారు. తాను ఏ పార్టీయో, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో తేల్చుకోవాలన్నారు. దీనిపై ప్రజలకు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు. అదేవిధంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఎమ్మెల్యేపై చేసిన వాఖ్య‌ల‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతామ‌న్నారు. పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టించే ఇలాంటి చర్యలు ఉపేక్షించరాదనీ పార్టీ అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామ‌న్నారు. మీడియా క్లిప్పింగులతో సహా విన్నవిస్తామ‌ని చెప్పారు. మొత్తం జిల్లా అంతా తన వారసులే ఎమ్మెల్యేలు అవుతారని మహేందర్ రెడ్డి అనడాన్ని ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యాల‌లో మ‌హేంద‌ర్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా అధిష్టానాన్ని కోరుతామ‌ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అడుగుజాడలలో నడుస్తూ, తాండూరును ప్రగతిపథంలో నడిపిస్తూ.. అభివృద్ధి…సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఎవ‌రైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హిత‌వు ప‌లికారు.