8నెల‌ల పాప‌కు హెచ్ఐవీ ర‌క్తం

జాతీయం తెలంగాణ

8నెల‌ల పాప‌కు హెచ్ఐవీ ర‌క్తం
– ర‌క్తినిధి కేంద్ర నిర్వ‌హ‌కుల నిర్ల‌క్ష్యం
ముంబయి, ద‌ర్శిని ప్ర‌తినిధి: 8నెల‌ల పాప‌కు హెచ్ఐవి పాజిటివ్ వ‌చ్చింది. ఈ దిగ్ర్బాంతికర సంఘ‌ట‌న మ‌హ‌రాష్ట్ర‌లోని అకోలా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ రక్తనిధి నిర్వాహకులు నిర్లక్ష్యంతో చేసిన తీవ్ర తప్పిదం 8 నెలల పసికందు పాలిట శాపంగా మారింది. జిల్లాకు చెందిన చిన్నారికి రెండు నెలల క్రితం తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో వైద్యుడి సూచన మేరకు ఆకోలాలోని ఓ రక్త నిధి నుంచి రక్తాన్ని ఎక్కించారు. ఆ తర్వాత చిన్నారి కోలుకున్నా మళ్లీ కొన్నాళ్లుగా తరచూ అనారోగ్యం బారిన పడేది. దీంతో చిన్నారిని అమరావతిలోని ఓ ఆసుపత్రిలో చూపించారు. పాపకు వేరే అనారోగ్య లక్షణాలు లేకపోవడంతో అనుమానించిన వైద్యులు హెచ్ఐవీ పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. ఆ పాప తల్లిదండ్రులకూ హెచ్వ పరీక్ష చేయగా నెగటివ్ వచ్చింది. దీంతో వైద్యులు వారిని ఆరా తీయగా రక్తం ఎక్కించిన విషయాన్ని వెల్లడించారు. ప్రతి రక్తనిధిలోనూ దాతల నుంచి రక్తాన్ని స్వీకరించేముందు హెచ్ఎవీ సహా అన్నిరకాల పరీక్షలు చేయాలని నిబంధనలు ఉన్నాయని, అయినా పాపకు రక్తనిధి నుంచి హెచ్ఐవీ రక్తం ఎలా ఎక్కించారన్నది తెలియాల్సి ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మూడు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే వైద్యాధికారులను ఆదేశించారు.