లయన్స్ క్లబ్ కంటి వైద్య శిబిరానికి స్పందన
– 27 మందిలో 19 మందిని ఆపరేషన్‌కు తరలింపు
– సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభిస్తోంది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాండూరులో విజన్ సెంటర్ నిర్వహిస్తూ హైదరాబాద్ లోని సాధూరాం కంటి ఆసుపత్రి వైద్యుల సహాకారంతో నెలలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆపరేషన్లు అవసరమైన వారిని హైదరాబాద్ కు తరలించి ఆపరేషన్లు కూడ చేస్తున్నారు. గత వారం 30 మందికి ఆపరేషన్లు చేయించారు. తాజాగా గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో 27 మందికి పరీక్షలు చేయగా 19 మందికి ఆపరేషన్లు అవసరమైనట్లు క్లబ్ అధ్యక్షులు జహీర్ అహమ్మద్, కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్‌లు తెలిపారు. వారిని కూడ ఆపరేషన్ కోసం హైదరాబాద్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. పేదలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి యూసుఫ్, విజన్ సెంటర్ ఛైర్మన్ ఓం ప్రకాష్ సోమాని.. సీనియర్ సభ్యులు సల్లా దామోదర్, వినోద్ కుమార్ జైన్, మహిళ సభ్యులు విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

