ఇదిగో నర్సింగ్ కాలేజ్…!
– తాండూరుకు సర్కారు కానుక
– రూ. 25 కోట్లతో కాలేజీ మంజూరు
– కలలు సాకారం చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి సర్కారు కానుకను ప్రకటించింది. ఇదిగో నర్సింగ్ కాలేజీ అంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరులో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ జీఓ 150ను జారీ చేసింది. రూ. 25 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. తాండూరు దక్కాల్సిన మెడికల్ కాలేజీ కొద్దిలో జారిపోయినా తాండూరులో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎంతో శ్రమించారు. అవకాశం దొరికిన ప్రతిసారి సీఎం కేసీఆర్ దృష్టికి నర్సింగ్ కాలేజీ మంజూరును తీసుకెళ్లారు. అదేవిధంగా గత సెప్టెంబర్ మాసంలో తాండూరు పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు దృష్టికి కూడ నర్సింగ్ కాలేజీ మంజూరు విషయాన్ని తీసుకెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి తాండూరుకు నర్సింగ్ కాలేజీని మంజూరు చేసింది. తాండూరుకు మెడికల్ కాలేజీ మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తాండూరులో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. నర్సింగ్ కాలేజీ మంజూరు పట్ల సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తాండూరు ప్రజల కలలను సాకారం చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇదివరకు నియోజకవర్గానికి మంజూరయ్యే డీఎంఎఫ్టీ నిధుల పెంపుతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం తరువాత తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ నిధులతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రజల కలల ప్రాజెక్టులను పురోగతి చేసేందుకు శ్రమిస్తున్నారు.

