ఎమ్మల్యేల నిర్బంధం బాధాకరం
– ప్రగతి భవన్ నుంచి పైలెట్‌కు విముక్తి కల్పించాలి
– కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు టీ.రామ్మోహన్ రెడ్డి
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నిర్బంధం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రామ్మోహన్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెనుసంచలమైన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం తరువాత తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్లో నిర్బంధం కావడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నలుగురు ఎమ్మెల్యేలు గత 20 రోజులుగా నిర్బంధంలో ఉండడం అనేక అనునామాలకు తావిస్తోందన్నారు. ఇలాంటి సంఘటన దేశ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నడూ చోటు చేసుకోలేదన్నారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని నిర్బంధం నుంచి విడిపించే కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ ఆదేశించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన నేతలు, తాండూరు ప్రజలు ఆందోళనలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ప్రగతి భవన్‌లో ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలను నిర్బంధం నుంచి విడిపించాలని ఆయా నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కావున తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రగతి భవన్ నుంచి బంధ విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యేలు నేరుగా నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాకుండా సంక్షేమాన్ని కొనసాగిస్తుందని అన్నారు. అనంతరం రామ్మోహన్ రెడ్డి నేతలతో కలిసి పట్టణ పోలీస్టేషన్ కు బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది నిర్బంధమా.. కిడ్నాపా.. అనే అనుమానాలు ఉన్నాయని, గత 20 రోజులుగా కనిపించడం లేదని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్ధన్ రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, పెద్దేముల్ మండల అధ్యక్షులు గోపాల్, పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు నవాజ్ తదితరులు ఉన్నారు.

