మెడికల్‌ ఆఫీసర్లుగా ట్రాన్స్‌జెండర్స్‌

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

మెడికల్‌ ఆఫీసర్లుగా ట్రాన్స్‌జెండర్స్‌
– ఉద్యోగాలు సాధించి చరిత్ర సృష్టి
– తెలంగాణలో ఇదే తొలిసారి
దర్శిని డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ట్రాన్స్‌ జెండర్స్‌ చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో తొలిసారి మెడికల్ ఆఫీసర్లుగా నియామకం అయ్యి.. తామూ కూడ ఎందులోనూ తక్కువ కాదని నిరూపించి ఆదర్శప్రాయులు అయ్యారు. పదండి చరిత్రలో రికార్డు ఎక్కిన ట్రాన్స్‌ జెండర్స్ ప్రాచీ రాథోడ్‌, కొయ్యల రుత్‌ జాన్‌ పాల్‌ల గురించి తెలుసుకుందాం.. వారి విజయగాధను చదువుకుందాం. ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ రుత్ మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ చదివారు. ప్రాచీ రాథోడ్‌ అదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2021లో నారాయణగూడలోని యూఎస్ఏఐడీ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ మిత్రలో చేరారు. అంతకుముందు నుంచే ఇద్దరూ ఎన్నో తిరస్కరణలు, అవహేళనలను ఎదుర్కొన్నారు. ఇన్నాళ్ల తరువాత హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్లుగా పోస్టింగ్ పొందాడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్స్‌గా చరిత్రపుటలక్కడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే.. వీరిద్దరూ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇది చాలా గొప్ప రోజు : రుతు జాన్‌ పాల్‌
తాను 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా అప్పటినుంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని 15 ఆసుపత్రులు తనను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. తన ఐడెంటిటీ వల్లే తిరస్కరిస్తున్నట్టు వారు తనకు చెప్పలేదని.. కానీ.. ఆ విషయాన్ని స్పష్టంగా గమనించానన్నారు. తన ఐడెంటిటీ బయటపడినప్పటి నుంచి ఆసుపత్రులు తన విద్యార్హతను పట్టించుకోలేదని రూత్ జాన్‌పాల్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఇది తన కమ్యూనిటీకి కూడా గొప్ప రోజని తెలిపారు.

ఆ విషయం తెలిసి ఉద్యోగంలో నుంచి తీసేశారు : ప్రాచీ రాథోడ్‌
ప్రాచీ రాథోడ్ కూడా దీనిపై హర్షం వ్యక్తంచేశారు. ఎన్నో పరాభావాల్ని ఎదుర్కొని.. ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. తాను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేశానని.. తన ఐడెంటిటీ తెలిసిన అనంతరం ఉద్యోగంలోనుంచి తీసేశారని తెలిపారు. తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయం తెలిస్తే, ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోతుందని.. ఆ ఆసుపత్రి యాజమాన్యం తనతో చెప్పిందని పేర్కొన్నారు. ప్రభుత్వరంగంలో వైద్యులుగా నియామకం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి విజయాన్ని అందించిందని పేర్కొన్నారు.