న్యూఇయర్‌ ప్రియులకు అలెర్ట్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

న్యూఇయర్‌ ప్రియులకు అలెర్ట్..!
– వేడుకలపై పోలీసుల గట్టి నిఘా
– మద్యం సేవించి దొరికితే వాహనం సీజ్
– బహిరంగ గందరగోళంపై ఈ పెట్టీ కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్దపడుతున్న ప్రజలు, యువకులకు పోలీసుశాఖ అలెర్ట్ ప్రకటించింది. మద్యం సేవించి దొరికితే.. బహిరంగ ప్రదేశాల్లో గందరగోళానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి జారీ చేసిన ఉత్తర్వులను పాటించేందుకు పోలీసు శాఖ సమాయత్తమైంది. ఇందులో భాగంగా న్యూయర్ వేడుకలపై గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి జనవరి 1 ఆదివారం ఉదయం 6 గంటల వరకు డ్రంక్ డ్రైవ్‌ చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. మద్యం సేవించి ఎవరైనా పట్టుబడితే జరిమానాలు, కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు నెంబర్ ప్లేట్లు లేకుండా, త్రిపుల్ రైడింగ్ వెళ్లినా, నిబంధనలు అతిక్రమించిన వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రతి వీదిలో పెట్రోలింగ్‌తో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బహిరంగా ప్రదేశాల్లో న్యూఇయర్ వేడుకల పేరుతో గందరగోళం, ఇబ్బందులు సృష్టిస్తే సహించేదని లేదని పోలీసులు స్పష్టం చేశారు. డీజే సౌండ్‌, ఇతర విధాలుగా శబ్దాలతో ఇబ్బందులు పెడితే ఈ పెట్టి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలను గమనించి ప్రజలు, యువకులు ఇంటి ఆవరణల్లోనే న్యూఇయర్ వేడుకలను జరుపుకోవాలని సూచిస్తున్నారు.