అమ్మకెంత కష్టం..!
– పురటి నొప్పులతో వేధన
– వాగు దాటే మార్గంలేక రైల్వే ట్రాక్ ద్వారా ఆసుపత్రికి
తాండూరు, దర్శిని ప్రతినిధి: మరికొన్ని గంటల్లో అమ్మకాబోతున్న ఓ అమ్మకు పెద్ద కష్టమొచ్చింది. పురిటి నొప్పులతో వాగు దాటే మార్గం లేక సమీపంలోని రైల్వే ట్రాక్ మీదుగా సురక్షిత ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత నాలుగు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలు మండలాల్లో కూడ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాల మద్య రాకపోకలు స్థంభించిపోతున్నాయి. తాండూరు మండలం బెల్కటూర్, అల్లాపూర్, బొంకూరు, బిజ్జారం మద్య ఉన్న వాగులు కూడ ఉప్పొంగుతున్నాయి. అయితే తాండూరు మండలంలోని కరణ్‌కోట్‌కు చెందిన మితిలేష్ కుమార్ భార్య మనీషా కుమారి మొదటిసారి గర్భం దాల్చింది. ఆదివారం ఉదయం పురటినొప్పులు రావడంతో అప్పటికే తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
వాగు పొంగడంతో.. రైల్వే ట్రాక్ మీదుగా
మార్గమద్యలోని బెల్కటూర్ వద్దకు రాగానే శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో తాండూరు – బెల్కటూర్ మద్య రాకపోకలు నిలిచిపోయాయి. అదే మార్గంలో వచ్చిన అంబులెన్స్‌లో మనీషా కుమారికి నొప్పులు అధికమయ్యాయి. ఏం చేయాలో తోచని పరిస్థితి అప్పటికే అంబులెన్స్ మెడికల్ టీం సభ్యులు ప్రాథమిక చికిత్స అందజేశారు. అయినా ఏ ఫలితం లేకపోవడంతో సమీపంలో ఉన్న కరణ్‌కోట్ సీసీఐ రైల్వే ట్రాక్ మీదుగా ట్రాక్ తోపుడి బండిపై మనీషాను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ట్రాక్ పై దాదాపు 2,3 కిలో మీటర్లు సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి మరో అంబులెన్స్‌లో మనీషాను తాండూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇబ్బందులను పరిష్కరించాలి
భారీ వర్షాల కారణంగా గ్రామాల రాకపోకలకు ఎదరవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఇటీవలే బొంకూరు గ్రామంలో వాగుదాటే పరిస్థితి లేక.. సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి చెందిన సంఘటనను గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు, పాలకులు వర్షాల వల్ల రాకపోకలకు ఇబ్బందలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు దృష్టిసారించాలని కోరుతున్నారు.