వర్షాల వేళ నిర్లక్ష్యమా..
– గ్రామ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ మండిపాటు
దర్శిని ప్రతినిధి : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం వహించరాదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఓ గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మీర్జాపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో గ్రామ కార్యదర్శి స్థానికంగా లేకపోవడం కారణంగా మండిపాటును వ్యక్త పరిచారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్య వహించరాని, గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పిచ్చి మొక్కలుతొలగించి.. మంచి మొక్కలు నాటాలన్నారు. వీదుల్లో హైపోక్లోరైడ్ పిచికారి చేయించాలన్నారు. రోడ్లపై నీరు నిలువ్వకుండ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత డీఈ, ఎఈలను ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైన్ ల కోసం ఎస్టిమేషన్లు తయారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారిని ఆదేశించారు. మరోవైపు గ్రామంలో దళిత వాడ సర్వేను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, ఎంపీడీఓ ఉషా, తహసీల్దార్ కిరణ్, డివిజన్ పంచాయతీ అధికారిని అనిత తదితరులు పాల్గొన్నారు.
