రండి.. ఫిర్యాదులు చేయండి..!
– ఎల్లుండి మున్సిపల్‌లో ప్రజావాణి
– ఏయే అంశాలపై ఫిర్యాదు చేయాలంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి: రండి.. ఫిర్యాదులు చేసుకోండి అని తాండూరు మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఎల్లుండి సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10-30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఏయే అంశాలపై ఫిర్యాదు చేయాలో కూడ అందులో సూచించారు. పట్టణానికి చెందిన ప్రజలు పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, టౌన్ ప్లానింగ్, ఆసరా ఫించన్లు, బర్త్ అండ్ డెర్త్ సమస్యలపై ఫిర్యాదు చేసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్లు నిర్మాణం, మురుగుకాలువల నిర్మాణం వంటి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడం జరగదని తెలిపారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఫిర్యాదులు చేసుకోవాలని సూచించారు.

