అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
– ఐసీఎల్ కర్మాగారంలో సంఘటన
– మృతుడు కర్మాగారం ఆసుపత్రి అటెండర్
– కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తాండూరు మండలంలోని ఐసీఎల్(ది ఇండియా సిమెంట్ కర్మాగారం)లో వెలుగులోకి వచ్చింది. కరణ్ కోట్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన లక్ష్మణ్ చాలా ఏళ్ల క్రితం తాండూరు పట్టణం ఎన్టీఆర్ నగర్లో ఇళ్లు నిర్మించుకుని భార్య, పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. గత 26 ఏండ్లుగా లక్ష్మణ్ తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని ఐసీఎల్ కర్మాగారంలో కొనసాగుతున్న ఆసుపత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం రాత్రి విధులు ముగించుకున్న లక్ష్మణ్ కర్మాగారంలో తనకు కేటాయించిన గదిలో గొల్లెం పెట్టుకుని నిద్రించాడు. ఆదివారం ఉదయం మెడికల్ ఆఫీసర్ లక్ష్మణ్ కు ఫోన్‌చేయగా స్పందించలేదు. గది వద్దకు వెళ్లి లక్ష్మణ్‌ను పిలిచినా పలకలేదు. అప్పటికే చలనం లేకుండా పడి ఉన్నాడు. వెంటనే కరణ్ కోట్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మధుసూధన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా లక్ష్మణ్ మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లక్ష్మణ్ గుండెపోటుతో మృతి చెందాడా.. పిడ్స్ వచ్చి మృతి చెందాడా అని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు.

మరోవైపు లక్ష్మణ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు రవిశిందే, గనికార్మిక సంఘం మాజీ వైస్ చైర్మన్ పండరి, మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి, కాంగ్రస్ నాయకులు వడ్ల మల్లేశం తదితరులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మృతునికి కుటుంబాన్ని కర్మాగారం ఆదుకోవాలని కోరారు.

