బుట్ట గణేష్ అదుర్స్..!
– ఆకట్టుకుంటున్న పర్యావరణ గణేషుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి వచ్చిందంటే రసాయనాలతో.. రంగులతో తయారు చేసిన గణనాథులను ప్రతిష్టించేందుకు మొగ్గుచూపుతారు. పర్యావరణంపై ప్రేమతో ఇంకొందరు మట్టి వినాయకులను ప్రతిష్టిస్తారు. ఈ సారి వినాయక చవితి సందర్బంగా ఓ కళాకారుడు అల్లిన బుట్టలు, సాపలతో బుట్ట గణేష్‌ను రూపొందించాడు. తాండూరులో విభిన్నంగా కొలువుదీరిన ఈ పర్యావరణ గణనాథుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. పట్టణంలోని కాళీకాదేవి ఆలయంలో ఈ వినాయున్ని ప్రతిష్టించారు. తాండూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కడ్ మధు సూదన్ ఈ గణేషున్ని తయారు చేశాడు. గతంలో కూడ మధుసూదన్ న్యూస్ పేపర్లతో, మరోసారి టిష్యూ పేపర్లతో పర్యావరణ హిత గణేషున్ని తయారు చేసి అందరికి ఆకర్షించాడు. ప్రతి యేడాదిలాగే ఈ సారి కూడ పర్యావరణ వినాయకుని తయారు చేయాలనే ఉద్దేశంతో అల్లిక బుట్టలు, చాట, సాపలతో బుట్ట గణేషున్ని రూపొందించాడు. దర్శించుకున్న భక్తులందరు బుట్ట గణేష్ అదుర్స్ అంటున్నారు.
