గులాబీ మయమైన గ్రీన్ సిటీ…!

తాండూరు రాజకీయం వికారాబాద్

గులాబీ మయమైన గ్రీన్ సిటీ…!
– పార్టీలో చేరిన వరాల శ్రీనివాస్ రెడ్డి, అనుచరులు
– కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రోహత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని గ్రీన్‌సిటీ కాలనీ గులాబీ మయంగా మారింది. బుధవారం 13వ వార్డుకు చెందిన కౌన్సిలర్, కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులు గులాబీ కండువా కప్పుకున్నారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీతో తాండూరు పట్టణ అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణ సర్కారు సహాకారంతో పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. మున్సిపల్లో 36 వార్డులకు రూ. 1 కోటి చొప్పున నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే కాంగ్రెస్, ఇతర పార్టీ నేతలు గులాబీ. గూటికి చేరుతున్నారని అన్నారు. పార్టీలో నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ ను మరింత బలమైన శక్తిగా మార్చాలన్నారు.

పార్టీలో చేరిన వరాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని, అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని అన్నారు. అందుకే పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతంతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా వార్డులో హరిగౌడ్‌, వరాల శ్రీనివాస్ రెడ్డిల మద్య ఉన్న వర్గపోరుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలోనే చెక్ పడింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు హరిగౌడ్‌, వరాల శ్రీనివాస్ రెడ్డిలు గజమాల ధరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో వార్డులో వర్గపోరు తొలగిపోయినట్లే అని స్థానికులు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, ఆసిఫ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.