ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
– రూ. 90లకే టీ-24 టికెట్ ధర నిర్ణయం
– సిటీలో రోజంతా నగరం మొత్తం తిరిగే చాన్స్
– మరిన్ని టిక్కెట్ సదుపాయాలపై రాయితీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే ఆర్టీసీ ప్రయాణికులతో పాటు నగరంలోని ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ బంపర్ ఆఫర్ అందించింది. గ్రేటర్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో టి-24 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ టికెట్ ధరను తగ్గించినట్లు ప్రకటించింది. గురువారం నుంచే ఈ ధరలు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. గతంలో టి-24 టికెట్ ధర రూ.100లు ఉంటే దానిని రూ.90కి తగ్గించింది. అంటే రూ. 90లకే నగరం మొత్తం తిరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కొత్తగా సీనియర్ సిటిజన్లకు టి-24 టికెట్ లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే ఆ టికెట్ ను అందించనుంది. 60 ఏళ్ళు పైబడిన వారికే టి-24 టికెట్ లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది.
ఈ టీ-24 టికెట్‌ను కొనుగోలు చేస్తే సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత టి-24ని 100కి తగ్గించింది. ఒక లీటర్ పెట్రోల్ ధర కంటే తక్కువకే 24 గంటల పాటు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. దీంతో పాటు మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం అందుబాటులో ఉంచిన టి-6 టికెట్‌ను రూ.50 కి కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవచ్చు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చామని ఆర్టీసీ చైర్మన్, ఎండీలు వివరించారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించచవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

